Sircilla: అధిక ధరలకు బియ్యం అమ్మితే చర్యలు: డీఎస్‌వో తనూజ!

Sircilla: రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరల కంటే ఎక్కువకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి తనూజ హెచ్చరించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 6:27 PM IST
Sircilla
X

Sircilla: అధిక ధరలకు బియ్యం అమ్మితే చర్యలు: డీఎస్‌వో తనూజ!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తనూజ హెచ్చరించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు, వినియోగదారులపై అధిక ధరల భారం పడకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అనుగుణంగా బియ్యం విక్రయాలు జరగాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వివిధ రకాల బియ్యానికి గరిష్ట రిటైల్ ధరలు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

బీపీటీ / కేఎన్‌ఎం బియ్యం: కిలో రూ.66

ఆర్‌ఎన్‌ఆర్ / తెలంగాణ సోనా బియ్యం: కిలో రూ.74

హెచ్‌ఎంటీ / జేఎస్‌ఆర్ బియ్యం: కిలో రూ.79

జిల్లా కేంద్రంలోని పలు బియ్యం విక్రయ దుకాణాలను జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయించరాదని రైస్ మిల్లర్లు, రైస్ ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లకు ఆదేశించారు. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరల వివరాలను ప్రతి విక్రయ కేంద్రం వద్ద వినియోగదారులకు కనిపించేలా బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA