Sircilla: ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రథమ స్థానం
Sircilla: ఉపాధి హామీ పనుల కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పురోగతి సాధించిన అధికారులను అభినందించిన ఉన్నతాధికారులు.
Sircilla: ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రథమ స్థానం
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాధి హామీ పనుల కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు శాశ్వత ఆస్తుల నిర్మాణం, ప్రకృతి వనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. జిల్లాలో చేపడుతున్న పనులు, కూలీల హాజరు, ఉపాధి కల్పనలో సాధించిన పురోగతిపై రాష్ట్ర స్థాయి అధికారులు అభినందనలు తెలిపారు.
విస్తృతంగా ఉపాధి హామీ పనులు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీజీ రామ్ జీ) కార్యక్రమం కింద విస్తృతంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో కూలీలకు ఉపాధి కల్పించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నారు.
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల గుర్తింపు, అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి అమలు చేస్తున్నారు. ప్రతి కూలీకి ఏడాదిలో 125 రోజుల వరకు పని కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 378 రకాల పనుల్లో భాగంగా చెరువుల్లో పూడికతీత, మట్టి రహదారుల నిర్మాణం, ఫిష్ పాండ్స్ ఏర్పాటు, అటవీ భూముల్లో కందకాల నిర్మాణం, మొక్కలు నాటడం, వాటి సంరక్షణ వంటి పనులు చేపడుతున్నారు. పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణం, కంపోస్టు షెడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు వంటి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. పొలాల కాలువల శుభ్రత, సాగునీటి కాలువల మరమ్మతులు వంటి శ్రమ ఆధారిత పనులను కూడా గుర్తించి అమలు చేస్తున్నారు.
ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి, మొబైల్ ఫోన్ల ద్వారా హాజరు నమోదు చేసేలా చర్యలు చేపట్టారు.
జిల్లాలో 98 వేల జాబ్ కార్డులు
జిల్లాలో మొత్తం 260 గ్రామ పంచాయతీలు ఉండగా, సుమారు 98 వేల జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ సగటున 32,148 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు జిల్లాలో మొత్తం 4,02,360 పని దినాలు కల్పించారు.
తెలంగాణ జలసిరి పనులు పురోగతిలో
వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పథకం కింద పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో 210 ఫామ్ పాండ్స్, 1,769 మ్యాజిక్ సోక్ పిట్స్, 91 సామూహిక ఇంకుడు గుంతలు, 464 బోర్‌వెల్ రీచార్జ్ గుంతల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే అత్యధిక సగటు
జిల్లాలో ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సగటున 45 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సగటు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉందని పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో జిల్లా సాధించిన పురోగతిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో పాటు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను రాష్ట్ర స్థాయి అధికారులు అభినందించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం రూ.12.90 కోట్లు చెల్లించగా, మెటీరియల్ కోసం రూ.76 లక్షలు కేటాయించారు. మెటీరియల్ ఖర్చుల కింద ఇంకా రూ.7.37 కోట్లు వెచ్చించాల్సి ఉందని వివరించారు.
కూలీలకు పని కల్పించేలా ప్రణాళికలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వీబీజీ రామ్ జీ కింద కూలీలకు విస్తృతంగా పనులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గ్రామాల్లో అనువైన పనులను గుర్తించి అమలు చేసేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఉపాధి పనులకు కూలీలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని, రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉపాధి కల్పన, శాశ్వత ఆస్తుల నిర్మాణం, వనరుల సంరక్షణలో మరింత పురోగతి సాధించేలా ముందుకు సాగుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.




