Sircilla: రౌడీ హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రౌడీ, హిస్టరీ షీటర్ల ఇళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని ఎస్పీ హెచ్చరించారు.
Sircilla: రౌడీ హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు!
Sircilla: జిల్లాలో రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల ఇళ్లను సందర్శించి వారి ప్రస్తుత కార్యకలాపాలు, జీవన విధానం, కదలికలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా సంబంధిత వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నేర ప్రవృత్తికి దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాలని స్పష్టం చేశారు.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు.
నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవిస్తున్న వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం షీట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు అధికారులు సూచించిన సమయాల్లో సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బైండోవర్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.




