Sircilla: ఒంటికాలిపై నిలబడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన పదో రోజుకు సమ్మె

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద 10వ రోజుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె. ఒంటికాలిపై నిలబడి నిరసన. ఉద్యోగాల రెగ్యులరైజ్, వేతన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 22 Oct 2026 5:21 PM IST
Sircilla
X

Sircilla: ఒంటికాలిపై నిలబడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన పదో రోజుకు సమ్మె

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ ప్రాంగణంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో భాగంగా గురువారం ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

పది రోజులుగా రోజుకో రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, పీఆర్‌సీ అమలు చేయాలని, ఐదు శాతం ఇంక్రిమెంట్‌ మంజూరు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA