Sircilla: ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించాలి: దశరథం డిమాండ్!
Sircilla: సిరిసిల్ల పట్టణంలో రూ.50 కోట్ల విలువైన సర్వే నంబర్ 1581 ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి ఆక్రమణలను అరికట్టాలని ఏఐఎఫ్టీయూ న్యూ నేత దశరథం డిమాండ్ చేశారు.
Sircilla: ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించాలి: దశరథం డిమాండ్!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి, ఆక్రమణలను అరికట్టాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. మెహర్ బాబా గుడి సమీపంలోని సర్వే నంబర్ 1581లో ఉన్న రెండు ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని కాపాడి, ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు.
ఈ భూమికి సంబంధించిన వివరాలను సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీఐ ద్వారా సేకరించినట్లు దశరథం తెలిపారు. సంబంధిత భూమి వివరాలు, పహాణీ పత్రాలతో రెండేళ్ల క్రితం సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ అంశం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని మున్సిపల్ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం సిరిసిల్ల తహసీల్దార్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్కు మరోసారి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని ఈ భూమి విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని, అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆక్రమణలకు అవకాశం ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని సర్వే చేసి, స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని, హద్దురాళ్లు ఏర్పాటు చేసి భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవసరాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భూమిని వినియోగించాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన కోరారు.




