Sircilla: జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులకు ఆదేశం.

KALEEM, SIRICILLA
Updated on: 31 Oct 2026 9:10 PM IST
Sircilla
X

Sircilla: జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల: తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులను పెద్ద సంఖ్యలో చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, వీబీజీ రామ్ జీ పనులపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, హౌసింగ్ ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలతో శనివారం జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలి

భూగర్భ జలాల వృద్ధికి తెలంగాణ జలసిరి కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంట కోతలు ముగిసిన వెంటనే రైతులు ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభించేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

జిల్లాలో తెలంగాణ జలసిరి కింద ఇప్పటివరకు 82 ఫామ్ పాండ్లు, 102 బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, 237 మ్యాజిక్ సోక్ పిట్లు, 18 రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలు పూర్తయ్యాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ కలెక్టర్‌కు వివరించారు. అన్ని మండలాల్లో పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష

జిల్లాలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. మండలాల వారీగా ప్రారంభమైన నిర్మాణాలు, పూర్తయిన ఇండ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 3,969 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ముగ్గు పోసిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని, బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను గోడల స్థాయికి, అక్కడి నుంచి స్లాబ్ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుది దశ పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయించి, ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, అర్హుల వివరాలపై కూడా కలెక్టర్ సమీక్షించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

వీబీజీ రామ్ జీ పనుల పురోగతి

వీబీజీ రామ్ జీ కింద జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనుల వివరాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 167 వీఓ భవనాల నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటివరకు 34 పూర్తయ్యాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి.

అలాగే 92 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టగా, 35 పూర్తయ్యాయి. జిల్లాలో 94 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటివరకు 12 పూర్తయ్యాయని, మిగిలిన పనులు కొనసాగుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖాజా ముజాఫరుద్దీన్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA