Sircilla: సిరిసిల్లలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Oct 2026 8:30 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అధ్యక్షతన జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్‌వైజర్ సిబ్బందితో సమావేశం జరిగింది.

సమావేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. గర్భిణీలను ప్రారంభ దశలోనే నమోదు చేసి, అవసరమైన పరీక్షలు, టీకాలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ప్రసవానికి ముందు, ప్రసవానంతర సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాదకర గర్భిణీలను ముందుగానే గుర్తించి, అవసరమైన ఉన్నత వైద్య సేవలకు రిఫర్ చేయడం ద్వారా మాతా శిశు మరణాలను నివారించాలని సూచించారు.

మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. వ్యాధులు గుర్తించిన వారికి నిరంతర చికిత్స, ఫాలోఅప్ అందించాలని సూచించారు.

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో దోమల నియంత్రణ, యాంటీ లార్వల్ చర్యలు, డ్రై డే కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు విస్తృతంగా ఆరోగ్య అవగాహన కల్పించడంతో పాటు జ్వరంతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అనంతరం తగిన చికిత్స అందించాలని సూచించారు.

జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అనుమానిత క్షయ రోగులను త్వరగా గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందిస్తూ.. చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా గ్రామీణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

తమ పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని వైద్యాధికారులు, సూపర్‌వైజర్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ నాగేందర్ బాబు, డాక్టర్ రామిరెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్‌వైజర్ సిబ్బంది, డీడీఎం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA