Sircilla: అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ భూముల ఆక్రమణల అడ్డుకట్టకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలు. 157 వెట్‌ల్యాండ్స్ గుర్తింపు, సంయుక్త సర్వేకు నిర్ణయం.

KALEEM, SIRICILLA
Published on: 4 Nov 2026 6:57 PM IST
Sircilla
X

Sircilla: అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అటవీ భూములను ఆక్రమణల నుంచి సంరక్షించాలని, వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణ, చెరువుల (వెట్‌ల్యాండ్స్) పరిరక్షణ, అభివృద్ధి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నియామకం తదితర అంశాలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అటవీ భూముల ఆక్రమణలు, భూ సరిహద్దుల గుర్తింపు, ఫారెస్ట్, రెవెన్యూ శాఖల రికార్డుల పరిశీలన, సిట్ నియామకం తదితర అంశాలపై చర్చించారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో భూముల సర్వే నిర్వహించి, పట్టా భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూముల వివరాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు.

అటవీ భూముల సరిహద్దులను నిర్ధారించి, ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, అటవీ భూముల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

157 వెట్‌ల్యాండ్స్ గుర్తింపు

చెరువులు, వెట్‌ల్యాండ్స్ ప్రకృతి సమతుల్యతను కాపాడటంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు కీలకమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 157 వెట్‌ల్యాండ్స్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. వీటి హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్ వివరాలను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ, నీటిపారుదల శాఖల సమన్వయంతో సర్వే చేసి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

వెట్‌ల్యాండ్స్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అటవీ శాఖకు పంపించాలని తెలిపారు. వీటి పరిరక్షణతో స్థానిక, వలస పక్షులు, వన్యప్రాణులకు ఆవాసాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటంతో పాటు మొక్కలు, చేపల పెంపకానికి కూడా ఇవి దోహదపడతాయని వివరించారు.

అటవీ శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వాలి

అటవీ భూముల్లో మొక్కలు నాటడం, ఇతర కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పోలీస్ శాఖకు ముందస్తు సమాచారం అందించాలని ఎస్పీ మహేష్ బి. గితె సూచించారు. అటవీ భూముల ఆక్రమణలు తదితర అంశాల్లో అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల శాఖ అధికారి దయాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఎఫ్‌ఆర్‌ఓలు నాగేశ్వర్ రావు, శీతల్, మున్సిపల్ కమిషనర్లు లోకేష్, ఖదీర్ పాషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA