Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలి
Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష; పాఠశాలల హాజరు, నిర్మాణ పనుల వేగవంతంపై ఆదేశాలు.
Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని, బడికి రాకపోవడానికి గల కారణాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో విద్యాశాఖ, పంచాయతీరాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఎఫ్ఆర్ఎస్, ఎఫ్ఎల్ఎన్, ఆన్లైన్ తరగతులు, పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, నాబార్డ్ నిధులతో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పీఎం ఉష పథకం కింద గంభీరావుపేట, అగ్రహారంలో చేపట్టిన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రోజువారీ, వారాంతపు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని, ఈ తరగతులు పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అన్ని పాఠశాలల్లో పేరెంట్ టీచర్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, సమావేశాలపై తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం అందించి వారు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితంపై అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరచాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని, గత ప్రశ్నాపత్రాల సాధనతో పాటు అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా బోధించాలని తెలిపారు.
విద్యాశాఖ అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పురోగతిని పరిశీలించాలని, మండల, జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయసాగర్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, వివిధ మండలాల విద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




