Sircilla: పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ గరిమ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన 10 నిమిషాల కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని పిల్లల అభివృద్ధి, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
Sircilla: పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ గరిమ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన 10 నిమిషాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని పిల్లల అభివృద్ధి, పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు కొలతలను పరిశీలించి, పోషకాహార లోపంతో బాధపడుతున్న సామ్, మామ్ పిల్లల పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళవారం 10 నిమిషాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరేళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా పంపించాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువును నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి ఎదుగుదలకు అనుగుణంగా పౌష్టికాహారం అందించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంతో పాటు ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా పిల్లలకు విద్యాబోధన జరుగుతుందని వివరించారు. పిల్లల జీవితంలో మొదటి వెయ్యి రోజుల దశ అత్యంత కీలకమని, ఈ సమయంలో ఇంటి వద్ద కూడా తగిన పోషకాహారం అందించాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు, వసతుల మెరుగుదల, పోషకాహార పంపిణీ, బాలల హక్కుల పరిరక్షణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, సామ్, మామ్ పిల్లలకు అవసరమైన పోషకాహారం అందేలా చూడాలని సూచించారు. త్వరలో జిల్లాలో ఎనీమియా ముక్త్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
మహిళలు, గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, మునగ కాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ తనిఖీ
అంగన్వాడీ కేంద్రం పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన యూనిఫాంలు ధరించిన విద్యార్థులతో మాట్లాడి, గణితం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు.
పిల్లలకు మెరుగైన వైద్య సేవలు
ఎదుగుదల లోపాలు, వినికిడి, మాట, మానసిక అభివృద్ధి, నడక సంబంధిత సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్బీఎస్కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. అవసరాన్ని బట్టి కరీంనగర్లోని ఎన్ఆర్సీ కేంద్రంతో పాటు హైదరాబాద్లో ఉన్నత వైద్య సేవలు అందించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.




