Sircilla: సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల వృద్ధుల సంరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంలో వృద్ధులకు ఘన సన్మానం
Sircilla: సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు!
Sircilla: వయోవృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణకు సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. వృద్ధులు జిల్లా కేంద్రంలోని డే కేర్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధులకు సన్మానం నిర్వహించడంతో పాటు, వృద్ధుల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి వృద్ధుల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, వాటి ప్రయోజనాలను వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వృద్ధుల నుంచి గౌరవం, మర్యాద, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వారి జీవిత అనుభవాలను యువత నేర్చుకోవాలని సూచించారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను పిల్లల పేరిట బదిలీ చేసే సమయంలో వృద్ధులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఆస్తి బదిలీ చేసిన తర్వాత తమ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించకపోతే ఆస్తిని తిరిగి పొందేలా నిబంధనలను చేర్చుకోవాలని సూచించారు.
వృద్ధ మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఏర్పాటుకు అవకాశం కల్పించిందని, జిల్లాలో ఇప్పటికే 469 సంఘాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వృద్ధ మహిళలు ఈ సంఘాల్లో చేరి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనవళ్లు, మనవరాళ్లకు నీతి కథలు, మంచి అలవాట్లు నేర్పిస్తూ కుటుంబంలో విలువలను పెంపొందించాలని సూచించారు. వృద్ధులు సమాజ సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న డే కేర్ సెంటర్ సేవలను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
వృద్ధులు తమకు ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను తెలియజేసేందుకు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని ఎస్పీ మహేష్ బి. గితె తెలిపారు. పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వృద్ధులకు అవసరమైన సేవలు అందిస్తారని, వారికి అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య, వృద్ధుల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




