Sircilla: ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం కరువు.. డిసెంబర్ 15 నుంచి సమ్మె!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే డిసెంబర్ 15 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు.
Sircilla: ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం కరువు.. డిసెంబర్ 15 నుంచి సమ్మె!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో ఏఓకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో డిసెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నామని ఆశా వర్కర్లు తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొలినాళ్లలో రూ.150 పారితోషికంతో ప్రారంభమైన తమ సేవలకు ప్రస్తుతం రూ.9,900 వరకు చెల్లిస్తున్నప్పటికీ, అది కూడా చేసిన పనులు, కేసుల ఆధారంగానే ఇస్తున్నారని పేర్కొన్నారు. తమకు ఇప్పటికీ నెలవారీ స్థిర వేతనం లేదని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి నెలకు రూ.18 వేల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. పైగా విపరీతమైన టార్గెట్లు విధిస్తూ పనిభారాన్ని పెంచుతున్నారని ఆరోపించారు.
గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలకు తీసుకురావాలని అధికారులు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలనుకునే వారిని అడ్డుకోవడం క్షేత్రస్థాయిలో తమకు కష్టంగా మారుతోందని ఆశా వర్కర్లు తెలిపారు. గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే అధికారులు తమను బాధ్యులుగా చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రావాల్సిన వేతనాలను జమ చేయకుండా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పనిభారం, అధికారుల వేధింపులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.




