Sircilla: ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా అనురాధ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షురాలిగా జోగినపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శిగా లకావత్ మోతిలాల్ ఏకగ్రీవ ఎన్నిక.

KALEEM, SIRICILLA
Published on: 7 Nov 2026 8:05 PM IST
Sircilla
X

Sircilla: ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా అనురాధ

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నవంబర్ 6న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజ గంగారెడ్డి, ఎన్నికల పర్యవేక్షణ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.

ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షురాలిగా జోగినపల్లి అనురాధ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా లకావత్ మోతిలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజ గంగారెడ్డి మాట్లాడుతూ.. గత 23 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడంతో వారు మానసిక ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని కోరారు.

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులపై ఆన్‌లైన్ పనిభారం పెరుగుతున్న నేపథ్యంలో నాన్ టీచింగ్ సిబ్బందిని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షురాలు జోగినపల్లి అనురాధ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ ప్రాథమిక సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి లకావత్ మోతిలాల్‌తో పాటు కార్యవర్గ సభ్యులకు ఎన్నికల పర్యవేక్షణ అధికారి హరిప్రసాద్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA