Karimnagar: ఆశా కార్యకర్తల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి!

Karimnagar: రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, అసెంబ్లీలో తమ సమస్యలు ప్రస్తావించాలని కరీంనగర్ ఆశా వర్కర్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 13 Nov 2026 6:35 PM IST
Karimnagar
X

Karimnagar: ఆశా కార్యకర్తల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి!

కరీంనగర్: ఆశా కార్యకర్తల దీర్ఘకాలిక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం కరీంనగర్ జిల్లా ప్రతినిధులు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కోరారు. ఈ మేరకు నేడు ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని, సమ్మె నోటీసును అందజేశారు.

ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27,130 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక సేవలందిస్తున్నారని తెలిపారు. గర్భిణుల నమోదు నుంచి ప్రసవం వరకు, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ, క్షయవ్యాధి నియంత్రణతో పాటు కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ తమకు ఇప్పటికీ కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,700 పారితోషికం మాత్రమే అందుతోందని, గత ఐదేళ్లుగా పారితోషికాలు పెరగలేదని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పని భారం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయాలని కోరుతూ అనేక పోరాటాలు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.

2024 డిసెంబర్ 9, 10 తేదీల్లో హైదరాబాద్ కోఠిలో నిర్వహించిన ఆందోళనల సందర్భంగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు పలు హామీలు ఇచ్చారని, రూ.50 లక్షల బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రూ.50 లక్షల జీవిత బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ సమయంలో రూ.5 లక్షల ప్రయోజనం కల్పించడంతో పాటు పారితోషికంలో సగం పెన్షన్‌గా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు, ఏడాదికి 20 రోజుల క్యాజువల్ లీవ్స్, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకు ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని, రెండో పీఆర్సీలో రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు వర్తింపజేయాలని కోరారు.

డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే బీఆర్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2026 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సమ్మె నోటీసులో వెల్లడించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని గంగుల కమలాకర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో.. కరీంనగర్ బిఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపీ తిరుపతి నాయక్, ఆశా సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు ఎం.డి. రబియా బేగం, ప్రధాన కార్యదర్శి దొండపాటి సరిత, ఉపాధ్యక్షురాలు నాంపెల్లి సుమలత, కోశాధికారి మాచర్ల వనజ, కార్యదర్శి జేరిపోతుల జయలలిత, సంయుక్త కార్యదర్శులు మాచర్ల భాగ్యలక్ష్మి, తిప్పారపు జయలలిత, బి ఆర్ టి యు నాయకులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN