Pulivendula: టీడీపీపై నిందలు మానుకోండి: ఎంపీ అవినాష్‌కు బీటెక్ రవి వార్నింగ్!
Pulivendula: టీడీపీపై నిందలు వేయడం మాని పులివెందుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి హితవు పలికారు.
Pulivendula: టీడీపీపై నిందలు మానుకోండి: ఎంపీ అవినాష్‌కు బీటెక్ రవి వార్నింగ్!
పులివెందుల: ప్రతి చిన్న సంఘటనకు ప్రెస్మీట్లు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీపై రిగ్గింగ్, దౌర్జన్యాలు, పోలీసుల వేధింపులంటూ ఆరోపణలు చేయడం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అలవాటుగా మారిందని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికల ఫలితాలను బట్టి మాట మార్చడం, టీడీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లింగాల మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయని తెలిపారు.
అక్కడ టీడీపీ పోలింగ్ ఏజెంట్లు ఎక్కడైనా హింసకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపించాలని అవినాష్ రెడ్డికి సవాల్ విసిరారు. గతంలో నామినేషన్ల సందర్భంగా తమపై జరిగిన దాడుల నేపథ్యంలో కేసులు ఎదుర్కొన్నప్పటికీ, ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో వ్యవహరించామని పేర్కొన్నారు. అదే సమయంలో పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లెలో 400 నుంచి 500 మంది వైకాపా కార్యకర్తలు టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ ఘటనలో టీడీపీ నాయకులకు చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఎర్రిపల్లెలో మహిళలను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడ్డారని, వేల్పులలో కారం పొడి చల్లడంతో పాటు టపాసులు ప్రయోగించారని ఆరోపించారు. వేములలో ఆరు పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరిగిందంటూ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు.
ఒకవైపు టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు చేస్తూ, మరోవైపు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆయా ఘటనలకు సంబంధించిన ఆధారాలు, దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నామినేషన్ రోజు జరిగిన రాళ్లదాడి, కాల్పులు, బాష్పవాయువు ప్రయోగం వంటి పరిణామాల వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
అన్నదమ్ములిద్దరూ టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించిన బీటెక్ రవి, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ ఆరోపణలకే పరిమితం కావడం మంచిది కాదన్నారు. ఇకనైనా ప్రెస్మీట్లు, విమర్శలు పక్కనపెట్టి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని అవినాష్ రెడ్డికి హితవు పలికారు.




