Karimnagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించాలి: గంగుల!

Karimnagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించాలని, మిగిలిన అర్హులను గుర్తించి మంజూరు చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 16 Nov 2026 2:51 PM IST
Karimnagar
X

Karimnagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించాలి: గంగుల!

కరీంనగర్: అర్హులైన ప్రతి పేదవాడికి చేయూత ఫెన్షన్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలవాలని, పేదలకు అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో వందమంది కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం పది మందికే పింఛన్లు మంజూరయ్యేవని, మిగతా 90 మంది తమకు పెన్షన్ రావాలంటే లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోవాలని ఎదురుచూసే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఫెన్షన్ ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2,000కు పెంచి పేదలకు అండగా నిలిచిందని తెలిపారు. గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అంతమందికీ పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ఆనాడు ప్రభుత్వం పనిచేసిందన్నారు.

ప్రభుత్వాలు మారుతుంటాయని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతంలో కొత్తపల్లి మండలంలో 2,327 పింఛన్లు ఉండగా, తాజాగా మరో 354 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా పింఛన్లు పొందిన అర్హులకు అభినందనలు తెలిపారు.

అయితే ఇంకా అనేక గ్రామాల్లో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు ఉన్నారని, చిన్నచిన్న సాంకేతిక కారణాలతో, రేషన్ కార్డుల నిబంధనలతో కొందరికి పింఛన్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరినీ గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లో పింఛన్లు అందని అర్హుల వివరాలను సేకరించి, వారి తరఫున ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.

పింఛన్ డబ్బులే ఆధారంగా ఎన్నో పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ ఎంతో ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గ్రామాల్లో పక్షపాతానికి తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు పొందిన లబ్ధిదారులకు, గ్రామాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ తో పాటు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ఫాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీఓ అశోక్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN