Sircilla: గురుకుల విద్యార్థులకు దుప్పట్లు, వేడినీరు ఇవ్వాలి: బీఆర్‌ఎస్వీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గురుకుల విద్యార్థులకు దుప్పట్లు, వేడినీటి సౌకర్యాలు కల్పించాలని శుక్రవారం కలెక్టర్‌కు బీఆర్‌ఎస్వీ వినతిపత్రం ఇచ్చింది.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 5:51 PM IST
Sircilla
X

Sircilla: గురుకుల విద్యార్థులకు దుప్పట్లు, వేడినీరు ఇవ్వాలి: బీఆర్‌ఎస్వీ!

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చలి తీవ్రత నుంచి రక్షణ కల్పించడంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సరిపడా దుప్పట్లు అందుబాటులో లేకపోవడం, ఉదయం వేళల్లో స్నానాలు చేసేందుకు వేడినీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చల్లటి నీటితో స్నానాలు చేయాల్సి రావడం చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన దుప్పట్లు పంపిణీ చేయాలని, ఉదయం వేళల్లో వేడినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అవసరమైన దుస్తులు, ఇతర కనీస వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, సంబంధిత అధికారులు అన్ని గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

విద్యార్థులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్, బల్యాల ప్రవీణ్, చెట్టిపెల్లి హరీశ్, మారం కార్తికేయ పటేల్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA