Sircilla: రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: రెడ్డబోయిన గోపి!

Sircilla: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Nov 2026 5:03 PM IST
Sircilla
X

Sircilla: రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: రెడ్డబోయిన గోపి!

సిరిసిల్ల: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి నాయకత్వంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించాలనే ఆశయంతో కృషి చేశారని పేర్కొన్నారు.

బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు.

రాజ్యాంగాన్ని చేతబట్టి తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని గోపి అన్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను అణచివేసి ప్రతిపక్ష నాయకులను జైళ్లలో నిర్బంధించారని విమర్శించారు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే చేతిలో పట్టుకోవడం మాత్రమే కాదని, అందులోని విలువలను ఆచరణలో పాటించడమేనని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంబేద్కర్ జీవితంతో ముడిపడిన ఐదు ప్రముఖ ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం ఆయన సేవలకు గుర్తింపుగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య పునాది అని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక వివక్ష నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, సాధికారత మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, లింగంపల్లి శంకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంటి మహేష్, పార్లమెంట్ కో-కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, రేగుల శ్రీకాంత్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్ సాబీర్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు వంతడుగుల సుధాకర్, మల్లారపు తిరుపతి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, వీర్నపల్లి మండల అధ్యక్షుడు లకుపతి నాయక్, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, జిల్లా నాయకులు రాజాసింగ్, గొట్టె రామచంద్రం, గజబింకర్ చందు, సెన్సార్ బోర్డు సభ్యురాలు వేముల వైశాలి, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు భీమనపల్లి శోభ, మున్సిపల్ కౌన్సిలర్ మామిడాల మహేష్, రంగంపల్లి గ్రామ సర్పంచ్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA