Karimnagar: కరీంనగర్ జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం!

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జైలులో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్, జడ్జి, సీపీ హాజరయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Oct 2026 7:13 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం!

Karimnagar: జైలు జీవితం మార్పునకు వేదిక కావాలని గతం గురించి ఆలోచించకుండా ఇక్కడున్న సౌకర్యాలతో స్కిల్స్ పెంచుకుంటూ, చదువు నేర్చుకుంటూ బయటకు వెళ్లిన తర్వాత మంచి పౌరులుగా ఉన్నత స్థాయిలో ఉండేలా బాటలు వేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఖైదీలకు సూచించారు.

మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శివకుమార్, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే (స్థానిక సంస్థలు), శ్రీనివాస్ రెడ్డి (రెవెన్యూ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా జైలు సిబ్బంది.. ఖైదీల సంక్షేమం, నైపుణ్యాలు పెంచేందుకు అందిస్తున్న శిక్షణ వివరాలు, పెట్రోల్ బంకు, అప్రెంటిషిప్ ద్వారా కల్పిస్తున్న ఉపాధి, వసతి, కౌన్సెలింగ్, వైద్య సౌకర్యాలు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఖైదీల కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం బారిన పడితే అవసరమైన వైద్యసాయం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా ఖైదీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఖైదీల సంక్షేమం కోసం జైలు వెల్ఫేర్ సొసైటీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.జైలు జీవితం ఖైదీలలో పరివర్తన తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా జడ్జి శివకుమార్ మాట్లాడుతూ సత్యం, అహింస అనే ఆయుధాలు ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు.

జైలు అంటే శిక్షించే స్థలం కాదని.. ఖైదీలను సంస్కరించే ప్రదేశమన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఎన్నో రోజులు జైలు జీవితం గడిపారన్నారు. గాంధీజీ జైలు జీవితంలోనే క్రమశిక్షణ నేర్చుకొని రామాయణం ఇతర పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకున్నారన్నారు. జైలు జీవితం శిక్షకాలం కాదని ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రం అని గాంధీజీ చెప్పినట్లు జడ్జి పేర్కొన్నారు.

ఖైదీల సంక్షేమానికి వైద్య సేవలు, ఉల్లాసంగా గడపడానికి యోగ విద్య , ఇతర ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

సెక్రటరీ యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ జైలుకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ అంటే తెలుస్తుందని కోపం, ప్రతీకారం తగ్గించుకోవాలని ఖైదీలకు సూచించారు. సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, భావోద్వేగాలను నియంత్రించుకొని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగాలని పేర్కొన్నారు. గతం మన చేతుల్లో లేదని మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకొని ముందుకు సాగాలని ఖైదీలకు సూచించారు.

జైలు నుంచి బయటకు వెళ్లేటప్పటికీ మన కుటుంబ సభ్యులకు మనలో మారిన మనిషి కనిపించాలన్నారు.

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఇక్కడున్న సౌకర్యాలు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను సద్వినియోగం చేసుకొని బాధ్యత కలిగిన మనిషిలాగా బయటకు వెళ్లాలని ఖైదీలకు సూచించారు. కోపంలో నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడతారని కొత్త ఆలోచనలతో మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఖైదీలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకొని చదువుపై దృష్టి సారించాలని సూచించారు.

డీఎంహెచ్వో రాజగోపాల్ మాట్లాడుతూ ఖైదీలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు, కౌన్సిలింగ్ వివరించారు. ఖైదీలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సత్కరించారు. కళాకారుల పాటలు, చిన్నారుల నృత్యాలు అలరించాయి. అనంతరం పాటల పోటీల్లో ప్రతిప కనబరిచిన ఖైదీలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN