Karimnagar: తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత.. యాసంగిలో వరి సాగు చేయవద్దు
Karimnagar: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగు తగ్గించి, తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా ఆదేశించారు.
Karimnagar: తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత.. యాసంగిలో వరి సాగు చేయవద్దు
కరీంనగర్: సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ యాసంగి సీజన్లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు చిత్ర మిశ్రా, బి. సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, గరీమ అగర్వాల్ లతో కలిసి ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా ఉన్నత అధికారులు
వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, నీటి సంరక్షణ, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లో అమృత్ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరాలు సమర్పించారు.
ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కామాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, కొత్తగా నీటి ప్రవాహాలు లేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల బోరు బావులు ఉండగా, వాటిలో 5 నుంచి 6 లక్షల వరకు పనిచేయని పరిస్థితి ఉందని, భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయని తెలిపారు.
యాసంగి సీజన్లో వరి సాగుకు నీటి లభ్యత ఉండే అవకాశం లేనందున రైతులను వరి సాగు నుంచి దూరంగా ఉంచేందుకు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేయకుండా ఉండాలని, తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ఆదేశించారు.
ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలను ప్రోత్సహించాలని, కోతులు, ఇతర సమస్యలు లేని ప్రాంతాల్లో కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, పంటల అవసరాలను వివరించాలని తెలిపారు. రైతులు నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా సాగు చేసి నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. పంటలకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలని, సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
రానున్న ఎనిమిది నెలలకు సంబంధించి గ్రామస్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని ప్రత్యేక అధికారి సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి అవసరాలు, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పనులపై ముందస్తు అంచనాలు రూపొందించాలని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రానున్న నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి తెలిపారు. ప్రభుత్వం అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాలువల ద్వారా సాగునీరు అందని ప్రాంతాల్లో రైతులు బోరు బావులపై అధికంగా ఆధారపడితే విద్యుత్ డిమాండ్ పెరిగి సబ్స్టేషన్లపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాగునీటికి మాత్రమే అందుబాటులో ఉన్న నీటిని వినియోగించాలి...
ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలం వరకు ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కాలువల ద్వారా ప్రస్తుత ఖరీఫ్ పంటలను రక్షించేందుకు విడుదల చేసే నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా పర్యవేక్షించాలని, మధ్యలో మోటార్ల ద్వారా నీటిని తోడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాబోయే నెలల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అందుబాటులో విద్యుత్ లభ్యత పరిమితంగా ఉందని తెలిపారు. కాలువల ద్వారా సాగునీరు అందని పరిస్థితుల్లో రైతులందరూ బోరుబావుల ద్వారా నీటిని తోడితే విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగి సబ్స్టేషన్లపై అధిక భారం పడుతుందని, ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు.
వచ్చే ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు విద్యుత్ రంగంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ట్రాన్స్‌కో పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఆదేశించారు. విద్యుత్ ఓవర్‌లోడ్, సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయిలో మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణకు ప్రాధాన్యత..
కేంద్ర ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాలకు ఉపశమనం కల్పించేందుకు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రత్యేక అధికారి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు రాకుండా చూడాలన్నారు. వీబీ-జీ రామ్ జీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ఫారంపాండ్లు, మ్యాజిక్ ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ గుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్లు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు.
కాలువల్లో పూడిక తొలగింపు, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులను కూడా చేపట్టి నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పిస్తూనే నీటి సంరక్షణ ఆస్తులను అభివృద్ధి చేయాలని తెలిపారు.
అమృత్ పనులను వేగవంతం చేయాలి..
మున్సిపాలిటీల్లో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. ముఖ్యంగా వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అమృత్ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రస్థాయిలో సమీక్ష నిర్వహించి అవసరమైన ప్రత్యేక ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యాసంగిలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి పంటల సాగుకు నీరు విడుదల చేసే అవకాశం లేదని, అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితిని సాధారణ పరిస్థితిగా కాకుండా, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తరహాలో సమన్వయంతో ఎదుర్కోవాలని ప్రత్యేక అధికారి సూచించారు. కేవలం నిధులు అందుబాటులో ఉండటం మాత్రమే సరిపోదని, విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం ముఖ్యమన్నారు. ప్రతి శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 7 శాతం తక్కువగా 681.7 మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపారు. కొత్తపల్లి, జమ్మికుంట, ఎల్లందకుంట, వీణవంక, హుజురాబాద్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. దిగువ మానేరు జలాశయంలో 15.452 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, నెలవారీ అవసరాలైన 0.68 టీఎంసీల ప్రకారం సుమారు 512 నుంచి 593 రోజుల వరకు నీటి సరఫరాకు అవకాశం ఉందని వివరించారు.
మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో , కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నీరు సరఫరా అవుతోందని తెలిపారు. గంగాధర, మానకొండూరు, చొప్పదండి మండలాల్లో ఉన్న స్వల్ప సరఫరా అంతరాలను అధిగమించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు వివరించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 ఎల్పీసీడీ డిజైన్ ప్రకారం నీటిని అందిస్తూ, అమృత్ 2.0 కింద నీటి శుద్ధి కేంద్రాల పునరుద్ధరణ, ఏడు ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, 7.5 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్, 129 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు చేపట్టినట్లు తెలిపారు.
యాసంగిలో వరి సాగును 33 శాతం తగ్గించే ప్రణాళిక...
యాసంగి 2026-27 సీజన్లో వరి సాగును 2,82,845 ఎకరాల నుంచి 1,89,063 ఎకరాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా 93,782 ఎకరాల వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, మొక్కజొన్నను 60,177 ఎకరాలు, పప్పుధాన్యాలను 8,737 ఎకరాలు, నూనెగింజలను 8,566 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో 1,683 ఎకరాల్లో ఆయిల్ పామ్, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సూక్ష్మ సేద్యానికి రూ.5 కోట్ల లక్ష్యానికి గాను రూ.1.72 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు వివరించారు.
సెప్టెంబర్ చివరి వారంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, సెప్టెంబర్ 28న గరిష్టంగా 1,456.48 యూనిట్ల డిమాండ్ నమోదైందని తెలిపారు. భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా వీబీ-జీ రామ్ జీ ద్వారా జలసిరి కార్యక్రమం కింద 1,320 వ్యక్తిగత ఫారంపాండ్లు, 10,461 మ్యాజిక్ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్లు, రూఫ్‌టాప్ హార్వెస్టింగ్, బోరు రీచార్జ్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
మార్చి 2027 వరకు జిల్లాలో 5.96 లక్షల మెట్రిక్ టన్నుల పశువుల మేత అవసరం ఉండగా, 8.09 లక్షల మెట్రిక్ టన్నుల మేత అందుబాటులో ఉందని, 2.13 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు ఉందని తెలిపారు. పశువుల తాగునీటి అవసరాల కోసం జిల్లాలోని 184 నీటి తొట్లలో శిథిలావస్థకు చేరిన 127 తొట్లకు మరమ్మతులు చేయడంతో పాటు, మరో 261 కొత్త నీటి తొట్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ నిధులతో చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 9 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని తెలిపారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి అక్టోబర్ 10 నుంచి కాలువల ద్వారా నీటి విడుదల ప్రారంభమైనందున ప్రస్తుత ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు లేవని తెలిపారు.భీమారం, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, కోడిమ్యాల మండలాల్లో 34 నుంచి 41 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ మండలాలను మోస్తరు కరువు మండలాలుగా గుర్తించినట్లు వివరించారు.
ఎల్-నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, సెప్టెంబర్‌లో 33.32 శాతం, అక్టోబర్ మొదటి పక్షంలో 61.89 శాతం మేర డిమాండ్ పెరిగినప్పటికీ వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు సగటున 1.32 మీటర్లు లోతుకు వెళ్లాయని, రాబోయే రెండు నెలల వరకు తాగునీటికి ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చివరి ప్రాంతాలు, ప్రత్యేక సమస్యలున్న ప్రాంతాల్లో స్థానిక నీటి వనరుల ద్వారా అవసరాలు తీరుస్తున్నామని, అన్ని ప్రాంతాలకు ఇన్చార్జీలను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
జగిత్యాల పట్టణంలోని నీటి శుద్ధి కేంద్రం మరమ్మతులకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పట్టణ తాగునీటి డిమాండ్‌లో 78.5 శాతం మేర సరఫరా జరుగుతోందని వివరించారు. ఎస్సారెస్పీ పరిధిలో 1,086 రోజులు, మధ్య మానేరులో 580 రోజులు, బొల్లిచెరువులో 978 రోజులు, నందిమేడారంలో 342 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు ప్రజెంటేషన్‌లో వివరించారు. జిల్లాలో 3,287 చేతిపంపులు, 2,225 మోటార్లు, 528 బావులను ప్రత్యామ్నాయ నీటి వనరులుగా వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు వరి సాగుకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల రక్షణకు బిందు, తుంపర సేద్య పరికరాలను అందించడంతో పాటు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్లు, ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణ పనులను ముమ్మరం చేసినట్లు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో 863 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 5 శాతం తక్కువగా ఉందని తెలిపారు. సుల్తానాబాద్‌లో 33 శాతం, ఎలిగేడు మండలంలో 24 శాతం, జూలపల్లిలో 21 శాతం, మంథనిలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం ఉందని వివరించారు. ఖరీఫ్ సీజన్లో డ్రై స్పెల్స్ నమోదు కాకపోవడంతో జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు లేవని తెలిపారు.
ప్రస్తుతం పంటల పరిస్థితి సాధారణంగా ఉందని, పంటలకు నీటి ఎద్దడి లేదా ఎండిపోయిన పరిస్థితులు లేవని తెలిపారు. సెప్టెంబర్ 2026 నాటికి సగటు భూగర్భ జలమట్టం 4.54 మీటర్ల లోతులో ఉందని, 12 మండలాల్లో భూగర్భ జలమట్టం ఐదు మీటర్ల లోపు ఉందని పేర్కొన్నారు.శ్రీరామసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 2,12,036 ఎకరాల ఆయకట్టులో ప్రస్తుత ఖరీఫ్ పంటల రక్షణకు సుమారు 60 శాతం ప్రాంతానికి నీరు అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో 18.17 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు.
యాసంగి సీజన్లో నీటి వనరులు సరిపోని ప్రాంతాల్లో వరి సాగును పూర్తిగా తగ్గించి, తక్కువ నీటితో పండే మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయి అధికారులు తగిన పంటల ఎంపికపై మార్గదర్శకత్వం చేస్తున్నారని వివరించారు.
వరి సాగును తగ్గించేందుకు విత్తన దుకాణాలు, డీలర్ల ద్వారా కూడా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచి వరి విత్తనాల లభ్యతను తగ్గించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం 72.68 మిలియన్ యూనిట్లు పెరిగిందని తెలిపారు. వ్యవసాయ సర్వీసులకు రోజుకు సగటున 11 గంటల పాటు త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ నెట్వర్క్ బలోపేతానికి 862 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 35 ఫీడర్లు, ఆరు సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లాలోని 13 మండలాల్లో రుద్రంగి మినహా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వివరించారు. మధ్య మానేరు జలాశయంలో 23.42 టీఎంసీలు (85 శాతం), దిగువ మానేరు జలాశయంలో 15.45 టీఎంసీలు (64 శాతం), అప్పర్ మానేరులో 1.84 టీఎంసీలు (92 శాతం), అన్నపూర్ణ జలాశయంలో 1.59 టీఎంసీలు (45 శాతం), మల్కాపేట జలాశయంలో 1.24 టీఎంసీలు (41 శాతం) నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ప్రతిరోజూ 59.41 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నామని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 135 ఎల్పీసీడీ చొప్పున తాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. అత్యవసర పరిస్థితులు, పైప్‌లైన్ మరమ్మతుల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్ రూమ్‌లు, ప్రైవేట్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
యాసంగి 2026-27 సీజన్లో వరి సాగు విస్తీర్ణాన్ని 1,90,988 ఎకరాల నుంచి 1,27,180 ఎకరాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వరికి బదులుగా 23,162 ఎకరాల్లో మొక్కజొన్న, 2,370 ఎకరాల్లో శనగ, 3,320 ఎకరాల్లో వేరుశనగతో పాటు ఆయిల్ పామ్, కూరగాయల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు రోజుకు సగటున 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, 33/11 కేవీ సబ్స్టేషన్ల బలోపేతం, కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు ద్వారా విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు పశువులకు 3,28,475 మెట్రిక్ టన్నుల మేత అవసరం కాగా, 3,78,630 మెట్రిక్ టన్నుల మేత అందుబాటులో ఉందని తెలిపారు. 50,154 మెట్రిక్ టన్నుల మేర మిగులు మేత ఉందని వివరించారు. పశువుల తాగునీటి కోసం కొత్త నీటి తొట్ల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న తొట్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఫారంపాండ్లు, ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ నిర్మాణాలు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ నీటి సంరక్షణ ఆస్తులను అభివృద్ధి చేయడం ద్వారా రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ సమీక్షలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, అదనపు కలెక్టర్ అశ్వినీ తానజీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




