Sircilla: పవర్‌లూమ్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు!

Sircilla: పవర్‌లూమ్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్ట్ పున్నంచందర్ సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Oct 2026 12:01 PM IST
Sircilla
X

Sircilla: పవర్‌లూమ్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు!

Sircilla: ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో సిరిసిల్లలోని వెంకట్రావ్ నగర్‌లో పవర్‌లూమ్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆరోగ్య పరిరక్షణకు పలు సూచనలు చేశారు.

కార్మికులు పని ఒత్తిడి, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పున్నంచందర్ సూచించారు. ఈ అలవాట్లు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు మద్యపానాన్ని ఆశ్రయించకూడదని, అది క్రమంగా వ్యసనంగా మారి కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. మద్యపాన అలవాటు ఉన్నవారు అవసరమైనప్పుడు కౌన్సెలింగ్ కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించారు.

ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలని, నిద్రలేమి, తరచుగా మెలకువ రావడం, పగటిపూట అలసట వంటి సమస్యలు నిరంతరం వేధిస్తే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు విశ్రాంతికి సమయం కేటాయించడం, క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆందోళన, నిరాశ, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలని పేర్కొన్నారు.

మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, మద్యపాన వ్యసనం, ఆందోళన, నిరాశ, కుటుంబ సమస్యలకు సంబంధించి వ్యక్తిగత, కుటుంబ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయం పొందేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA