Yellareddypet: ఎల్లారెడ్డిపేట SBI ATM చోరీ కేసు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు!
Yellareddypet: ఎల్లారెడ్డిపేట SBI ATM నుంచి రూ.6,06,100 నగదు, యంత్రాన్ని ఎత్తుకెళ్లిన కేసులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Yellareddypet: ఎల్లారెడ్డిపేట SBI ATM చోరీ కేసు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు!
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన ఎల్లారెడ్డిపేట SBI ATM చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పలు రాష్ట్రాల్లో ATMలనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న SBI ATMలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ATM యంత్రాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.6,06,100 నగదును చోరీ చేయడంతో పాటు, ATM యంత్రాన్ని సైతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ ఛానల్ మేనేజర్ దాడిగల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన బహదూర్ చౌకీదార్ ప్రతబరామ్ బవారీ (36), గోపాల్ తేజారామ్ బవారీ (34)లను నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలోనూ పలు ATM చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందని డీఎస్పీ తెలిపారు.
నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. ATM కేంద్రాలు, బ్యాంకులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు.




