Karimnagar: కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీపీ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు!

Karimnagar: కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు. స్టేషన్ రికార్డులు పరిశీలన, సిసి కెమెరాల నిఘా, ప్రజలకు వేగవంతమైన సేవలందించడంపై పోలీసులకు దిశానిర్దేశం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Oct 2026 7:06 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీపీ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు!

Karimnagar: కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. స్టేషన్‌కు విచ్చేసిన కమిషనర్‌కు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ తిరుమల్ పూలమొక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని పలు విభాగాలను, రికార్డులను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది, వారి విధులు, క్షేత్రస్థాయి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మరింత పారదర్శకత, వేగం పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, కేస్ ప్రాపర్టీ భద్రత, రికార్డుల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొంటూ, స్టేషన్‌ పరిధిలోని అన్ని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

అలాగే పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉపయోగంలో లేని పాత సామాగ్రిని కమిషనరేట్‌కు తరలించి స్టేషన్ ప్రాంగణాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ తిరుమల్, ఎస్సై చేరాలు, ఇతర అధికారులు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN