Sircilla: సిరిసిల్ల జడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టం, బాలల హక్కులపై అవగాహన సదస్సు. న్యాయమూర్తి రాధిక జైస్వాల్ వెల్లడి.
Sircilla: సిరిసిల్ల జడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని పోక్సో కోర్టు ప్రత్యేక జిల్లా న్యాయమూర్తి రాధిక జైస్వాల్ అన్నారు. బాలలపై జరిగే లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి వేధింపులు లేదా అనుచిత ప్రవర్తన ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచనల మేరకు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” (Surakshit Bachpan Abhiyan) కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో బాలల హక్కులపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే విధించే శిక్షలు, బాలల చట్టపరమైన హక్కులు, రక్షణ చర్యలు, అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కార మార్గాల గురించి వివరించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, అనుచిత ప్రవర్తనను గుర్తించి అప్రమత్తంగా ఉండటంపై అవగాహన కల్పించారు.
అలాగే పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె (Complaint Box) ఉపయోగం, నిర్వహణ, దాని ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు. తమకు ఎదురయ్యే వేధింపులు, దుర్వినియోగం లేదా భద్రతకు సంబంధించిన సమస్యలను నిర్భయంగా ఫిర్యాదుల పెట్టె ద్వారా తెలియజేయవచ్చని ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.
బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండటం అవసరమని, పిల్లలపై జరిగే నేరాలను నివారించడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయం, అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కారాల గురించి వివరించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అందించిన అవగాహన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. బాలల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల హక్కులను కాపాడుతూ వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది కల్యాణ్ చక్రవర్తి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, పెంట శ్రీనివాస్, కుంట శ్రీనివాస్, కళ్యాణి, జైశ్వర్య, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




