Sircilla: పీఎం రాహత్‌తో ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం: సీఎస్ సంజయ్
Sircilla: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు చికిత్స అందుతుందని సీఎస్ సంజయ్ జాజు, సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
Sircilla: పీఎం రాహత్‌తో ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం: సీఎస్ సంజయ్
Sircilla: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఈ పథకం ద్వారా పోలీసుల ఆమోదం పొందిన కేసుల్లో బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చికిత్స అందించే అవకాశం ఉందని తెలిపారు.
పీఎం రాహత్ పథకం అమలుపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంజయ్ జాజు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడంలో గోల్డెన్ అవర్ కీలకమని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య సమన్వయం పెంచడంతోపాటు చికిత్స ఖర్చుల చెల్లింపుల ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పథకం అమలులో భాగంగా జిల్లా రహదారి భద్రత కమిటీలు, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధితుల వివరాలను పారదర్శకంగా నమోదు చేసేందుకు టీఎంఎస్ 2.0 పోర్టల్‌ను వినియోగించుకోవాలని, జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
అత్యవసర సేవల కోసం 112, సీసీటీఎన్ఎస్ వ్యవస్థల అనుసంధానంతో బాధితులకు వేగంగా సేవలు అందించాలని, ప్రజల్లో పీఎం రాహత్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లాలో పథకం అమలును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖలు అప్రమత్తమై సమన్వయంతో పనిచేయాలని, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, డాక్టర్ సంతోష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




