Chandurthi: మహిళా సంఘాల ఆత్మగౌరవానికి పక్కా భవనాలు: విప్ ఆది శ్రీనివాస్
Chandurthi: రాజన్న సిరిసిల్ల జిల్లా జోగాపూర్లో మహిళా సంఘ భవనాలకు భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు కానుందని తెలిపారు.
Chandurthi: మహిళా సంఘాల ఆత్మగౌరవానికి పక్కా భవనాలు: విప్ ఆది శ్రీనివాస్
Chandurthi: మహిళా సంఘాల ఆత్మగౌరవానికి పక్కా భవనాలను నిర్మాణం చేపడుతున్నామని నవంబర్ 19 నా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు... రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో త్రివేణి, గాయత్రి మహిళా వీవో సంఘాలకు నూతన పక్కా భవనాల నిర్మాణం కోసం సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతరం వడ్డీలేని రుణాల విధానాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.67 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు. ఒక్కో సంఘానికి రూ.20 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం కల్పిస్తూ మహిళలపై నమ్మకంతో ఎలాంటి పూచీకత్తులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు వివరించారు.
మహిళా సంఘాలకు కేవలం ఆర్థిక సహాయమే కాకుండా శాశ్వత భవనాలు, బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా ఆదాయ మార్గాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, తమ సమస్యలను చర్చించుకోవడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. జోగాపూర్ గ్రామంలో రెండు మహిళా సంఘాలకు భవనాలు మంజూరు కావడం సంతోషకరమని, ఐదు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. గతంలో కరెంట్ బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోందని పేర్కొన్నారు.
జోగాపూర్ గ్రామంలో సుమారు 53 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీపావళి పండుగను కొత్తగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లలో జరుపుకుంటున్న లబ్ధిదారుల ఆనందం, వారి కళ్లలో కనిపించిన సంతోషం ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
అలాగే ఈ నెల 19 నుంచి ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమిలేని పేద కుటుంబాలకు కూడా భీమా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి అర్హులైన కుటుంబాలను పథకంలో చేర్చనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వాలు రాష్ట్రంపై భారీగా అప్పుల భారం మోపినప్పటికీ, ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పేదలు, రైతులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
జోగాపూర్ గ్రామంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా, దేవస్థానం చైర్మన్గా పనిచేసిన అనుభవంతో గ్రామ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉన్నానని తెలిపారు. గ్రామంలో దేవాలయాలు, పాఠశాలలు, సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు, మంచినీటి సౌకర్యాలు వంటి అనేక అభివృద్ధి పనులకు గతంలో నిధులు మంజూరు చేయించామని, భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళా సంఘాల భవనాల నిర్మాణం ఐదు నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం, గ్రామీణ అభివృద్ధికి ఈ భవనాలు వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.




