Peddapalli: ఎల్‌నినో సవాళ్లను అధిగమించేలా ఆయిల్‌పామ్ యాజమాన్యం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, ఆయిల్‌పామ్ సాగు యాజమాన్యం, పంటల మార్పిడిపై ఉద్యానవన అధికారి గడ్డం శ్యాంప్రసాద్ రైతులకు అవగాహన కల్పించారు.

RAJU, PEDDAPALLI
Published on: 21 Nov 2026 3:56 PM IST
Peddapalli
X

Peddapalli: ఎల్‌నినో సవాళ్లను అధిగమించేలా ఆయిల్‌పామ్ యాజమాన్యం!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ముత్తారం గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, ఆయిల్‌పామ్ సాగుపై పంటల మార్పిడిపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ తోటల్లో సమర్థవంతమైన నీటి యాజమాన్యం, సమతుల్య పోషకాల వినియోగం ద్వారా పుష్పాల అభివృద్ధి, గెలల ఏర్పాటు, అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

అలాగే ఆయిల్‌పామ్ సాగులో రైతులకు అవసరమైన స్లాషర్లు, ష్రెడర్లు, మినీ ట్రాక్టర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు బిందు సేద్య పరికరాలపై ఉద్యానవన శాఖ ద్వారా రాయితీలు అందిస్తున్నట్లు వివరించారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేపట్టడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, కోకో సాగుకు కూడా ఉద్యానవన శాఖ ద్వారా రాయితీ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రమేష్ మాట్లాడుతూ, వాతావరణానికి అనుకూలంగా పంట మార్పిడి చేయాలని, ఒకే రకం పంట కాకుండా విభిన్నమైన పంటలు పండించాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని పెంపొందించాలని, చీడ పీడలపై రైతులు దృష్టి పెట్టాలని తెలిపారు.

ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ సాగులో ఎరువుల యాజమాన్యం, సమతుల్య పోషకాల వినియోగం, మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదల, అధిక దిగుబడుల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సాంకేతిక అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రామగుండం ఉద్యానవన అధికారి జ్యోతి, ఉద్యానవన విస్తరణ అధికారి రాజశేఖర్, వ్యవసాయ శాఖ అధికారి అనూష, విస్తరణ అధికారి మనీషా, ఆయిల్‌పామ్ క్షేత్రస్థాయి సిబ్బంది మరియు ముత్తారం గ్రామ సర్పంచ్ రవీందర్‌రావు, పీసీసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, జగన్ మోహన్ రావు, రైతులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI