Peddapalli: పెద్దపల్లి విద్యారంగానికి రూ.70 కోట్లు: విప్ విజయరమణ రావు!

Peddapalli: పెద్దపల్లిలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ విజయరమణ రావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు.

RAJU, PEDDAPALLI
Published on: 26 Oct 2026 5:16 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి విద్యారంగానికి రూ.70 కోట్లు: విప్ విజయరమణ రావు!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.27 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల రెనోవేషన్ పనులను, రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ (TASK) ప్రాంతీయ కేంద్రం మరియు రూ. 2.50 లక్షలతో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో నూతన వాటర్ ఫ్లాంట్ ను పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారితో కలిసి ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ జిల్లాలోని యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన అనేక మంది యువత ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. టాస్క్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు, సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలతో వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.

విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.70 కోట్లు

పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. పాఠశాలల పునరుద్ధరణ, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నామని, పెద్దపల్లి మండలంలోనే సుమారు రూ.14 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించడం పైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో పెద్దపల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించినట్లు తెలిపారు. గతంలో పెద్దపల్లి జిల్లా విద్యా ఫలితాల్లో 32వ స్థానంలో ఉండగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన చర్యల ఫలితంగా ప్రస్తుతం మొదటి స్థానానికి చేరుకుందని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లెక్చరర్లు విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.800 కోట్ల వ్యయంతో అల్పాహార పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. హరే రామ ట్రస్ట్ సహకారంతో అమలవుతున్న ఈ పథకం పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు దోహదపడుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ దశ అత్యంత కీలకమని, ఈ సమయంలో అనేక ఆలోచనలు, ఆకర్షణల వల్ల చదువుపై దృష్టి మరలే అవకాశం ఉంటుందని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించాలని సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రస్తుతం విద్యార్థులకు చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని, విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఇప్పటి నుంచే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు.

విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజానికి సేవ చేయాలని, తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి సాధించే విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా గర్వపడే స్థాయికి చేరుకోవాలని అన్నారు.

కళాశాలల్లో విద్యార్థుల హాజరును కఠినంగా పర్యవేక్షించాలని, హాజరు నిబంధనలు పాటించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించకూడదని సూచించారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో గణనీయమైన మార్పు

గత మూడేళ్లలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రభుత్వ విప్ తెలిపారు. ఇటీవల పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు అవార్డులు లభించాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె ద్వారా వచ్చే ఆదాయం నేరుగా కళాశాలకు చేరేలా జిల్లా కలెక్టర్ గారితో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రుల వద్ద ఉన్న షట్టర్లను అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రుల అవసరాలకు వినియోగించేలా చూస్తున్నామని వివరించారు. పేద ప్రజలు విద్య, వైద్య సేవల కోసం ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, సింగిల్ విండో చైర్మన్ మరియు కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు మరియు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు, పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI