Manthani: జర్నలిస్ట్ రామ్ కుమార్ అంతిమ యాత్ర.. శోకసంద్రంలో మంథని

Manthani: మంథని ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు, జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గోదావరి తీరంలో అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

SHANKAR, MANTHANI
Published on: 2 Nov 2026 5:52 PM IST
Manthani
X

Manthani: జర్నలిస్ట్ రామ్ కుమార్ అంతిమ యాత్ర.. శోకసంద్రంలో మంథని

మంథాని: మంథని ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అంతిమయాత్ర సోమవారం అశ్రు నయనాల మధ్య కొనసాగింది. అనారోగ్యంతో మృతి చెందిన ఆయన పార్థివదేహానికి మంథని పట్టణం నుండి గోదావరి తీరం వరకు జర్నలిస్టులు, బంధువులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులు అర్పించారు.

రామ్ కుమార్ స్వగృహం నుండి ప్రారంభమైన అంతిమయాత్ర మంథని ప్రధాన వీధుల మీదుగా గోదావరి తీరం వరకు సాగింది. దారి పొడవునా "పెండ్యాల రామ్ కుమార్ అమర్ రహే" అంటూ నినాదాలు మార్మోగాయి. ఆయనను కడసారి చూసేందుకు వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖులు, వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

రామ్ కుమార్ విద్యార్థి దశ నుంచే సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి, సుదీర్ఘ కాలం పాటు మంథని కేంద్రంగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. పేద ప్రజల గొంతుకగా నిలిచి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారు. నిజాయితీ, నిర్భయ జర్నలిజానికి ఆయన నిలువెత్తు నిదర్శనం.

ఆయన మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని, ఆయన సేవలు మరువలేనివని పలువురు జర్నలిస్టులు కన్నీటి పర్యంతమయ్యారు. మంథని ప్రెస్ క్లబ్, మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గోదావరి తీరంలో లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రెస్ క్లబ్ మంథని సభ్యులు, మంథని, రామగిరి, కమాన్ పూర్, ముత్తారం, పెద్దపల్లి, కరీంనగర్ మండలాల జర్నలిస్టులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని అశ్రు నివాళులు అర్పించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI