Manthani: ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని వినతి!
Manthani: తెలంగాణలో ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షుడు పోతరవేని క్రాంతి కుమార్ కోరారు.
Manthani: ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని వినతి!
మంథాని: తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులను ప్రస్తుత బీసీ-డీ వర్గం నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షుడు పోతరవేని క్రాంతి కుమార్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ సమాజం రాష్ట్రంలో గణనీయమైన జనాభా కలిగి ఉన్నప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అనేక ఏళ్లుగా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందన్నారు. సంప్రదాయ వృత్తులు, పరిమిత ఉపాధి అవకాశాలపై ఆధారపడిన కుటుంబాలు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధిలో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతున్నాయని తెలిపారు.
ముదిరాజ్‌ల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించి, వారి వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా ముదిరాజ్ సమాజం పరిస్థితులను పరిశీలించి, బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చేందుకు అవసరమైన సిఫారసులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ముదిరాజ్ విద్యార్థులకు ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యలో మెరుగైన అవకాశాలు కల్పించాలని, ఉపకార వేతనాలు, వసతి సదుపాయాలు, ఉచిత కోచింగ్ అందించాలని కోరారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో శిక్షణతో పాటు స్వయం ఉపాధి పథకాలు, తక్కువ వడ్డీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముదిరాజ్ మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సముచిత ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా పరిశీలించి ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులతో చర్చించి, ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే ప్రక్రియ ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని పోతరవేని క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు.




