Sultanabad: అర్హులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
Sultanabad: పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు సుల్తానాబాద్‌లో నూతన చేయూత పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
Sultanabad: అర్హులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్ల రోడ్డులో గల ఎస్.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం రోజున నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధితో పాటు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు చెందిన అర్హులకు మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పెన్షన్ పత్రాలనురాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, మహిళలు, చేనేత-గీత తదితర వృత్తిదారుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
గతంలో పింఛన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడ్డ అక్కాచెల్లెళ్లకు, సోదరులకు ఈరోజు ఊరట కలిగిస్తూ మండల వ్యాప్తంగా మొత్తం 1041 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మండలంలో 755 లబ్ధిదారులు 410 వికలాంగులు, 155 ఒంటరి మహిళలు, 48 మంది గీతా కార్మికులు, వితంతువులు 130, చేనేత 12 మంది లబ్ధిదారులకు పత్రాలను నిచ్చారు. మున్సిపల్ పరిధిలో 286 మంది లబ్ధిదారులు వికలాంగులు 57 మంది ఒంటరి మహిళలు 17 గీత కార్మికులు 20, చేనేత 4, వితంతువులు 158 మందికి పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు ఎంపికలో
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి అర్హులైన పేదలందరికీ న్యాయం చేయగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరస్కరణకు గురైన వారికి తీపి కబురు:
వివిధ కారణాల చేత తిరస్కరణకు గురైన వారికి త్వరలోనే అందులో అర్హులైన వారిని గుర్తించి అందిస్తామన్నారు. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో పింఛన్లు రాకుండా పోయాయని, అటువంటి వారు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు. "మీ బిడ్డగా, మీ ఎమ్మెల్యేగా 100% పర్స్యూ చేసి, రీ-సర్వే ద్వారా ఆ లోపాలను సరిదిద్ది భవిష్యత్తులో పింఛన్ ఇప్పించే పూర్తి బాధ్యత నాదే" అని పునరుద్ఘాటించారు.
గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు ఏమాత్రం పెన్షన్లు అందించిన దాఖలాలు లేవని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో పాటు మరో నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు అందించేలా ముఖ్యమంత్రితో మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ తో కలిసి నీరందించానని పంటలు ఎండిపోకుండా కాపాడాగలగామని వివరించారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కరువు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని వివరించారు.
విద్యుత్ సంక్షోభం ఎక్కడ లేదని ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ అందించే బాధ్యత తమదేనని తెలిపారు. గత పాలకులు ఎక్కడ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని తాము అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలతో నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మాణం చేసి అందించామని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అర్హులకి ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇస్తామని ఇది తన హామీ అని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాల పోలేదని అడ్డగోలు కటింగ్లతో అడ్డంగా దోసుకున్నారని వివరించారు.
మంజూరు ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులందరికీ రాబోయే నవంబర్ 19న (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి) సాయంత్రం లోపు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేశారు. మూడు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చారని పెన్షన్లు సైతం 100% ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను నిర్విరామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు 29 రాష్ట్రాలలోనే ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నారని వివరించారు. త్వరలో సహజ మరణానికి సైతం ఐదు లక్షల రూపాయల పెన్షన్‌ను అందించే విధంగా 3000 కోట్లు ఖర్చు చేసి బీమా ను అందించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
గ్రామాల్లో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు రాబోయే మార్చు,ఏప్రిల్ నెల నుంచి కొత్త ప్రక్రియ ప్రారంభించి, 3-4 నెలల వ్యవధిలో ప్రతి గ్రామంలో నూటికి నూరు శాతం అర్హులకు పింఛన్లు అందిస్తామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసిన అనంతరం, ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,000 పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం భవిష్యత్తులో మరింత పెంచి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు
సుల్తానాబాద్ మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో (రూ. 5 లక్షల ఆర్థిక సాయం) తో దాదాపు 800 మంది పేద ప్రజలు ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేసుకుంటున్నారని, ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి ధ్రువీకర పత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, డి ఆర్ డి ఏ ఏ పీ డి రవీందర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్, సింగిల్ విండో చైర్మన్లు చిలుక సతీష్, అనెడి భాస్కర్ రెడ్డి కళ్లేపల్లి జానీ, మురళిదార్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, రావు, పట్టణ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్ ధనాయక్ దామోదర్ రావు, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, , మండలంలోని సర్పంచులు, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




