Peddapalli: శిలాఫలకాలకే పరిమితమైన పెద్దపల్లి అభివృద్ధి: బీజేపీ నేత
Peddapalli: పెద్దపల్లి అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని, బైపాస్ రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారని బీజేపీ నేత పల్లె సదానందం ప్రశ్నించారు.
Peddapalli: శిలాఫలకాలకే పరిమితమైన పెద్దపల్లి అభివృద్ధి: బీజేపీ నేత
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో ఆర్భాటపు ప్రచారం, శిలాఫలకాల ఆవిష్కరణలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం తీవ్రస్థాయిలో విమర్శించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో పెద్దపల్లి నియోజకవర్గానికి సాధించిన అభివృద్ధి ఏమిటో ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి పనుల పేరుతో వందలాది శిలాఫలకాలు ఏర్పాటు చేయడం తప్ప, వాటిలో ఎన్ని పనులు పూర్తయ్యాయో చెప్పే పరిస్థితి లేదని విమర్శించారు. ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
గతంలో పెద్ద కల్వాల నుంచి అప్పన్నపేట వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామంటూ పెద్ద ఎత్తున హడావుడి చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారని, ఆ తర్వాత భూసేకరణ, రైతులకు నష్టపరిహారం చెల్లింపు వంటి కీలక అంశాలను పట్టించుకోకుండా పనులను అర్ధంతరంగా వదిలేశారని ఆరోపించారు. సుజల స్రవంతి పథకం పేరుతో కొంతమేర మట్టి పోసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. శిలాఫలకాలపై చూపిస్తున్న శ్రద్ధను పనుల పూర్తి చేయడంపై చూపించాలని హితవు పలికారు.
పెద్దపల్లి జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులకు, ప్రజలకు ఉపయోగపడాల్సిన సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. పట్టణంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ సైతం నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి ప్రధాన బజార్ రహదారి పనుల విషయంలో వ్యాపారులను బెదిరించడం, కొందరిపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. పండుగల సీజన్లో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన పెద్దపల్లి పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న కమాన్ చౌరస్తా రూపురేఖలను రాత్రికి రాత్రే మార్చే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణ చారిత్రక ఆనవాళ్లను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని, స్థానికుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు అందాల్సి ఉండగా, ఆర్థికంగా స్థితిమంతులైన వారికి ఇళ్లు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీరాంపూర్ మండలంలో అర్హులైన పేదలకు ఇప్పటివరకు ఇళ్లు అందకపోవడం బాధాకరమన్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రచార ఆర్భాటం పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం విఫలమైతే బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పెండింగ్ అభివృద్ధి పనుల సాధన కోసం బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ బాలసాని శ్రీనివాస్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఛాతరాజు రమేష్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర మనోహర్, నాయకులు జిట్టే రాజు, బండి కరుణాకర్, మంథని కృష్ణ, ముత్యాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




