Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా ‘దీక్షా దివస్ 2026’ క్రికెట్ పోటీలు
Peddapalli: పెద్దపల్లిలో ‘దీక్షా దివస్ 2026’ క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు; నవంబర్ 25-27 వరకు నియోజకవర్గ పోటీలు.
Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా ‘దీక్షా దివస్ 2026’ క్రికెట్ పోటీలు
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిందని, ఆ పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
దీక్షా దివస్ పురస్కరించుకుని ఆయన ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ‘దీక్షా దివస్ 2026 - నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్’ను బుధవారం ఉదయం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, టాస్ వేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాడు కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే బలమైన సంకల్పంతో చేపట్టిన నిరాహార దీక్ష వల్లే యావత్ తెలంగాణ సమాజం ఒక్కటై రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైందని గుర్తు చేశారు. ఆ త్యాగాల ఫలితంగానే నేడు మనం ప్రత్యేక రాష్ట్రాన్ని అనుభవిస్తున్నామని, ప్రస్తుతం 25 సంవత్సరాల లోపు ఉన్న యువతకు ఆనాటి ఉద్యమ ఘట్టాలను, పెద్దలు చేసిన పోరాటాలను తెలియజేయాలనే సత్సంకల్పంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా యువతను ఆకర్షించే క్రికెట్ పోటీల ద్వారా వారిలో క్రీడా స్ఫూర్తితో పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి పూనుకున్న పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు రేవెల్లి స్వామి, కనుకుర్తి కార్తీక్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
నవంబర్ 25 నుండి 27 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, పట్టణాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. ప్రారంభ రోజున పెద్దపల్లి మండలం-కాల్వశ్రీరాంపూర్ మండలం, జూలపల్లి మండలం-పెద్దపల్లి పట్టణం, సుల్తానాబాద్ మండలం-ఎలిగేడు మండలం, సుల్తానాబాద్ పట్టణం-ఓదెల మండలం జట్ల మధ్య పోటీలు జరగనుండగా, నవంబర్ 26న సెమీఫైనల్స్ మరియు 27న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ కోఆర్డినేటర్లు రేవెల్లి స్వామి, కనుకుర్తి కార్తీక్‌లతో పాటు పట్టణ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మర్కు లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, పట్టణ నాయకులు పూదరి చంద్రశేఖర్, కాశీపాక వాసు, జుబేర్, ముకీం, బైరం నటరాజ్, అజార్, వైద శ్రీనివాస్, ఫహీం, అతిక్, ముబాషీర్, ఎడ్ల మల్లేశం, బొడ్డుపల్లి రమేష్, నాగుల మల్యాల శ్రావణ్ కుమార్, పిట్టల మహేష్, మండల నాయకులు సలేంద్ర రాములు, సలేంద్ర లక్ష్మణ్, పెంచాల శ్రీకాంత్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, దాసరి సతీష్, బాలసాని శ్రీనివాస్, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




