Peddapalli: ఇన్సూరెన్స్ లేని జేసీబీతో కూల్చివేతలు!
Peddapalli: పెద్దపల్లిలో రోడ్ల విస్తరణ పేరుతో ఇన్సూరెన్స్ లేని జేసీబీతో కూల్చివేతలు, ప్లాస్టిక్ తనిఖీల వసూళ్లపై చాంబర్ సభ్యుడు జీషాన్ ఆదిల్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddapalli: ఇన్సూరెన్స్ లేని జేసీబీతో కూల్చివేతలు!
Peddapalli: పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు, మెయిన్ రోడ్ జెండా చౌరస్తాలో చెప్పుల దుకాణ యజమాని మహమ్మద్ జీషాన్ ఆదిల్ అలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో చిరు వ్యాపారుల ఆస్తులు, హక్కులను కాలరాయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేని కాంట్రాక్టర్కు చెందిన నాన్ ట్రాన్స్పోర్ట్ జేసీబీని మున్సిపల్ కమిషనర్ తన పలుకుబడితో తీసుకువచ్చి, స్వయంగా పర్యవేక్షిస్తూ మెయిన్ రోడ్ నుంచి మసీదు వరకు ఇళ్ల గోడలు, మెట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయించారని ఆరోపించారు.
ఈ చర్యల కారణంగా ఆస్తులు దెబ్బతిన్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అధికారులు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.
అలాగే, మున్సిపాలిటీగా ఏర్పడి ఆరేళ్లకు పైగా గడిచినప్పటికీ ఇటీవల ప్లాస్టిక్ తనిఖీల పేరుతో వ్యాపారులను అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జరిమానాలు విధిస్తామని బెదిరించి, రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీకి బదులుగా పాత నగర పంచాయతీ పేరుతో రసీదులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వ్యాపారుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిషోర్ శారడా సొంత ఆస్తిని సైతం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దురదృష్టకరమని అన్నారు. అధికారుల చర్యల వల్ల తలెత్తిన సమస్యలకు వ్యాపార సంఘం అధ్యక్షుడినే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం చేయడం అన్యాయమని ఖండించారు.
రోడ్ల విస్తరణ, పట్టణ అభివృద్ధి పనులు చేపట్టే ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా సర్వేలు నిర్వహించాలని, బాధిత వ్యాపారులతో చర్చించి, నిబంధనల ప్రకారం న్యాయబద్ధమైన పరిష్కారం చూపిన తర్వాతే పనులు చేపట్టాలని కోరారు.
వ్యాపారుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడుతున్న కమల్ కిషోర్ శారడాకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధిత వ్యాపారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి అనేది ప్రజల కోసం జరగాలి తప్ప, ప్రజల జీవితాలను నాశనం చేస్తూ జరగకూడదు. వ్యాపారుల హక్కులు, ఆస్తులు, ఆత్మగౌరవం కాపాడబడినప్పుడే నిజమైన అభివృద్ధికి అర్థం ఉంటుంది అని మహమ్మద్ జీషాన్ ఆదిల్ అలీ పేర్కొన్నారు.




