Peddapalli: సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ నేతలు నూనేటి సంపత్, వంగాల తిరుపతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Peddapalli: సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!
Peddapalli: రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి లు విమర్శించారు.పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాజీ జెడ్పిటిసి వంగాల తిరుపతి రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు సాగునీరందక పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర అరిగోస పడుతున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు నిర్విరామంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర కరెంట్ ఇస్తూ, కరెంట్ కోతలు పెట్టి పంటలు ఎండిపోయేలా చేసిందని ఆరోపించారు.
తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడితే.. ఈ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ నీటిని ఆంధ్రా పాలకులకు అమ్ముకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా పాలకులకు తొత్తుగా వ్యవహరించి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
SRSP ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, నీరందక ఎండిపోతున్న పంటలు కనిపించడం లేదా అని నిలదీశారు. రాబోయే యాసంగిలో రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం నుండి తక్షణమే నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సర్పంచులు బాసి సదాశివరెడ్డి, మంథని రాజయ్య, తీగల నాగరాజు, నాయకులు ఆకుల స్వామి, వివేక్‌పటేల్, నిదానపురం దేవయ్య, జూకంటి అనిల్, బైరం రమేష్, గోనే శ్యామ్, జెట్టి దేవేందర్, కొట్టే రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, నాగార్జునరావు, నారెడ్ల సదయ్య, నవీన్, సారంగపాణి, కనుకయ్య, మహేందర్, దొమ్ముటి శ్రీనివాస్, ఇబ్రహీం, తొట్ల శ్రీనివాస్, బడాల శ్రీనివాస్, జాలిగం నర్సింగం, ఎల్లంపెల్లి చంద్రయ్య, శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.




