Thangallapalli: బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల ప్రకటన.. అభినందించిన కలెక్టర్!
Thangallapalli: తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటిస్తూ గురువారం కలెక్టర్ గరిమ అగ్రవాల్, మర్రిపల్లి చందన సర్టిఫికెట్ అందజేశారు.
Thangallapalli: బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల ప్రకటన.. అభినందించిన కలెక్టర్!
తంగళ్లపల్లి: బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన వీవో భవనాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞతో పాటు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు, అనర్థాలపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసింది. అనంతరం బాల్య వివాహ రహిత గ్రామ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామ సర్పంచ్‌కు అందజేశారు.
బాల్య వివాహాలపై కఠిన చర్యలు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నేరెళ్ల గ్రామాన్ని బాల్య వివాహ రహిత ఆదర్శ గ్రామంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పిల్లలకు నిర్ణీత వయస్సు వచ్చిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిని ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళా సంఘాలు వీవో భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నూతనంగా ప్రారంభించిన వీవో భవనాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తరచూ సమావేశాలు నిర్వహిస్తూ మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక రుగ్మతల నిర్మూలన వంటి అంశాలపై చర్చించాలని తెలిపారు. పాఠశాల యూనిఫామ్‌ల కుట్టు, ఇతర నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు భవనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉల్లాస్ కార్యక్రమం కింద వయోజన మహిళలు విద్యను అభ్యసించాలని కోరారు.
మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పోషకాహారంలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు, పల్లీలు, నువ్వులు, గుడ్లు, పండ్లు తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, హక్కులపై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
పిల్లలను చదివించడం ప్రతి ఒక్కరి బాధ్యత: మర్రిపల్లి చందన
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఆమె చేపడుతున్న కార్యక్రమాలు సమాజంలో మార్పునకు దోహదపడుతున్నాయని అభినందించారు. పిల్లలను చదివించడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
నవంబర్ 27న బాల్య వివాహాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. బాల్య వివాహ ముక్త్ జిల్లా, రాష్ట్రం, దేశంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయసాగర్, మండల ప్రత్యేక అధికారి, డీపీఓ వీరభద్రయ్య, ఇన్చార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రమేష్, గ్రామ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




