Sircilla: సిరిసిల్లలో మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె!
Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణంలో మూడో రోజుకు చేరిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె. ప్రధాన రహదారులు, కాలనీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారంతో ప్రజల అవస్థలు.
Sircilla: సిరిసిల్లలో మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరడంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో చెత్త తరలింపు వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రధాన రహదారులు, వీధులు, ఖాళీ స్థలాలు, కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోతోంది.
ముఖ్యంగా కొత్త బస్టాండ్ ప్రధాన ప్రాంగణం ఎదుట భారీగా చెత్త పేరుకుపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివనగర్ చౌరస్తా వద్ద పార్కు పరిసరాల్లోనూ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. గోపాల్ నగర్, పెద్ద బజార్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చెత్త కుప్పల కారణంగా దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలని, అప్పటివరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
ఒకవైపు కార్మికుల సమస్యలు పరిష్కారం కాక సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి, పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.




