Karimnagar: కరీంనగర్‌లో ఆకట్టుకుంటున్న 'ఎకాం' ప్రదర్శన.. ప్రారంభించిన గంగుల కమలాకర్!

Karimnagar: మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహార్థం కరీంనగర్‌లో 'ఎకాం' ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రారంభం. హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Oct 2026 3:42 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఆకట్టుకుంటున్న 'ఎకాం' ప్రదర్శన.. ప్రారంభించిన గంగుల కమలాకర్!

Karimnagar: మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్వయంశక్తితో ఆర్థికంగా ఎదుగుతూ, పది మందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

స్థానిక ఉత్పత్తులకు ప్రజలు అండగా నిలవాలనే ఉద్దేశంతో కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో 'ఎకాం' (EKAM) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.

​నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులకు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.

​ప్రదర్శన ప్రారంభం అనంతరం అతిథులు వివిధ స్టాళ్లను పరిశీలించారు. మున్మున్ సేన్, రోజా, విశాల్ మరియు మిత్రబృందంతో పాటు పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు తమ నైపుణ్యంతో రూపొందించిన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

​మార్కెట్‌లో సాధారణంగా లభించని అనేక ప్రత్యేకమైన హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్, అందమైన చీరలు, గాజులు, మెహందీ ఉత్పత్తులు మరియు మహిళలకు అవసరమైన వస్తువులు ఇక్కడ కొలువుదీరాయి. ​పెద్ద షాపుల్లో అధిక ధరలకు లభించే కొన్ని హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు నేరుగా తయారీదారుల నుంచే అందుబాటులోకి రావడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ​

రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మహిళలకు, గృహాలకు అవసరమైన అనేక రకాల ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కాళ్లపై తాము నిలబడుతున్న మహిళలకు 'ఎకాం' చక్కటి వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిబిషన్‌‌ను సందర్శించడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా ఈ ఉత్పత్తులను మరింత మందికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ రెండు రోజుల (శనివారం, ఆదివారం) ప్రదర్శనకు ప్రజల నుంచి లభించే ప్రోత్సాహాన్ని బట్టి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, బీఆర్ఎస్ నాయకులు గంగాధర చందు, నారదాసు వసంత రావు, మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ అఫ్రోజ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN