Manthani: మంథనిలో వినాయకుడికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు
Manthani: మంథనిలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు.. సింగరేణి కార్మికుల ఇళ్ల రెగ్యులరైజేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Manthani: మంథనిలో వినాయకుడికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు
మంథాని: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులు దిగ్విజయంగా ముందుకు సాగేందుకు విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
“ప్రజలందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి” అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.




