Sircilla: సిరిసిల్ల సభను విజయవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్!
Sircilla: సిరిసిల్ల సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు.. విప్‌లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశంతో కలిసి సభా స్థలి ఏర్పాట్ల పరిశీలన.
Sircilla: సిరిసిల్ల సభను విజయవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్!
సిరిసిల్ల: ఈ నెల 30న సాయంత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలోని సభా స్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, విజయ రమణారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్‌రెడ్డితో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 నెలల ప్రజాపాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సిరిసిల్ల సభను వేదికగా ఉపయోగించుకోవాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు.
అదేవిధంగా సోలార్ విద్యుత్ కార్యక్రమాలు, విద్యార్థుల డైట్ చార్జీల పెంపు, ఆసుపత్రి చార్జీల పెంపు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక, ఐటీ రంగాల విస్తరణ, సాగునీటి పథకాలు, రైతాంగ సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను సభ ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న అండదండలు, చేపడుతున్న కార్యక్రమాలను కూడా సభలో వివరించనున్నట్లు తెలిపారు.
ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిరిసిల్ల సభకు తరలిరావాలని నాయకులు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 33 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రచార సభగా కార్యక్రమాన్ని నిర్వహించాలని, సభ స్ఫూర్తితో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.




