Dharmaram: అంబేద్కర్ విగ్రహాన్ని కండువాతో తుడిచిన మంత్రి అడ్లూరి
Dharmaram: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కండువాతో అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళులర్పించారు.
Dharmaram: అంబేద్కర్ విగ్రహాన్ని కండువాతో తుడిచిన మంత్రి అడ్లూరి
పెద్దపల్లి జిల్లా: ధర్మారం మండలం కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.ముందుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.... అక్కడ విగ్రహంపై దుమ్ము పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన మంత్రి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తన భుజంపై ఉన్న కండువా తీసి స్వయంగా విగ్రహాన్ని శుభ్రం చేశారు. విగ్రహంపై ఉన్న దుమ్మును ఎంతో భక్తి శ్రద్ధలతో తుడిచి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి ఆడంబరం లేకుండా, స్వయంగా విగ్రహాన్ని శుభ్రం చేయడం అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. నాయకుడు అంటే కేవలం మాల వేసి ఫోటో దిగడం కాదు, గౌరవంతో సేవ చేయడమని మంత్రి తన చేతల ద్వారా చూపించారని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రి చేసిన పనిని చూసి కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... డా. బి. ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని రచించి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి కార్యకర్త తన జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
పేదలు, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, బీసీలు, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు మరింత వేగంగా అమలవుతున్నాయని, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....




