Sircilla: హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన.. ఐఈసీ కార్యక్రమాలు ముమ్మరం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశామని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాంరెడ్డి తెలిపారు.
Sircilla: హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన.. ఐఈసీ కార్యక్రమాలు ముమ్మరం!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులకు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐఈసీ (IEC) కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, టీబీ, హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రాంరెడ్డి నేతృత్వంలో పలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా అంకుశాపూర్ మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల, బద్దనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రశ్నావళి నిర్వహించి అవగాహన కల్పించారు. హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, వ్యాధి నివారణ చర్యలు, అపోహలు-వాస్తవాలు, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులను ప్రశ్నించి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు.
హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై సరైన సమాచారాన్ని అందించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 1న నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అంకుశాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజు, ఉపాధ్యాయులు సాంబారెడ్డి, ఎన్జీవో సభ్యురాలు జ్యోతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, బద్దనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీశాల శంకర్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.




