Karimnagar: కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి!
Karimnagar: కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వివిధ డివిజన్లలో రూ. కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్.
Karimnagar: కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థను తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తమ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా మేయర్ 3, 11, 29వ డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
మొదటగా 11వ డివిజన్ కట్టరాంపూర్‌లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సయ్యతో కలిసి సుడా నిధులు రూ.3 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. స్థానిక పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం 3వ డివిజన్ మాణిక్యేశ్వరీ నగర్ రోడ్ నంబర్-2లో స్థానిక కార్పొరేటర్ సాదినేని లావణ్య మునీందర్ తో కలిసి నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.24.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరి 29వ డివిజన్ కిసాన్ నగర్, మింగని వాడ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్తో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
అనంతరం 28, 29వ డివిజన్ల పరిధిలోని హనుమాన్ దేవాలయం సమీపంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.56 లక్షలతో ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా కోసం చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు–అధికారుల సమన్వయంతో కరీంనగర్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మేయర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో పలువురు కార్పొరేటర్లు ఏపీపీ చంద్ర, గాజా రమా శివరాం, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




