Manthani: మంథని విద్యార్థి యువత 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కొండేల మారుతి!
Manthani: మంథని విద్యార్థి యువత సంస్థ 44 ఏళ్ల ప్రస్థానంలో 2000వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కొండేల మారుతి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Manthani: మంథని విద్యార్థి యువత 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కొండేల మారుతి!
మంథని: సామాజిక సేవే లక్ష్యంగా స్వచ్ఛంద స్ఫూర్తితో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంథని విద్యార్థి యువత సంస్థ 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి కోరారు. సంస్థ 44 వసంతాల ప్రస్థానంలో భాగంగా రానున్న నెలలో నిర్వహించనున్న 2000వ శుభోత్సవ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని సంస్థ కార్యాలయంలో చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి అధ్యక్షతన సమాలోచన, సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంథనికి చెందిన ఉపాధ్యాయులు లావణ్య, ఉషా, మంజుల, రిటైర్డ్ ఉపాధ్యాయులు మారుతి, తాటి బుచ్చన్న గౌడ్ తదితరులు సునీ సిస్టర్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శుభారంభం పలికారు.
అనంతరం కొండేల మారుతి మాట్లాడుతూ.. గత 44 సంవత్సరాలుగా సంస్థ సామాజిక బాధ్యతతో విద్య, వైద్యం, సాహిత్యం, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోందన్నారు. మద్యపాన నిషేధంపై అవగాహన, మొక్కల పెంపకం, రక్తదాన శిబిరాలు, ప్లాస్టిక్ వినియోగ నిర్మూలన, వినియోగదారుల అవగాహన తరగతులు, గ్రంథాలయ నిర్వహణతో పాటు మొత్తం 25 విభిన్న అంశాలపై నిరంతరం సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
రానున్న నెలలో నిర్వహించనున్న 2000వ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిష్ణాతులు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు త్వరలో మంథని ప్రాంతానికి చెందిన ప్రవాసీయులను తమ ప్రతినిధి బృందం కలిసి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం రామడుగు మారుతీరావు, చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి, తాటి బుచ్చన్న గౌడ్, నారమల్ల కృష్ణ, బోగోజు శ్రీనివాస్ తదితరులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం మంథని విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మేరీ మీడియా ట్రిక్స్ హై స్కూల్ హెచ్‌ఎం సునీ సిస్టర్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 44 ఏళ్లుగా కొనసాగుతున్న సేవా ప్రస్థానంలో 2000వ కార్యక్రమం ఒక ప్రత్యేక మైలురాయిగా నిలవనుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ వేడుకను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.




