Manthani: నగరంపల్లి అంగన్వాడీలో చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరంపల్లిలో కూతురు పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ చిన్నారులకు సర్పంచ్ నాతరి లత శ్రీనివాస్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.
Manthani: నగరంపల్లి అంగన్వాడీలో చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ
మంథని: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలని పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరంపల్లి సర్పంచ్ నాతరి లత శ్రీనివాస్ అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు.
చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలంటే పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, ఆహారం తీసుకునే సమయంలో పరిశుభ్రత పాటించడం కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని, వారిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నతనం నుంచే పెంపొందించాలని సూచించారు.
ప్రతి చిన్నారికి ప్రత్యేకంగా ప్లేటు, గ్లాసు ఉండటం వల్ల పరిశుభ్రత పాటించడంతో పాటు ఆహారం తీసుకునే అలవాట్లు మెరుగుపడతాయని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల పట్ల అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ ఆటపాటలతో విద్యాబోధన చేపట్టాలని సూచించారు.
గ్రామంలోని చిన్నారుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోరెడ్డి ప్రసన్న తిరుపతిరెడ్డి సెక్రటరీ శ్రీనివాస్ వార్డు సభ్యులు నౌండ్ల సదానందం కన్నూరి స్నేహ మల్యాల కిరణ్ రెడ్డి గడ్డం సరోజన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




