Sircilla: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 16 Nov 2026 6:07 PM IST
Sircilla
X

Sircilla: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం అమలుపై ఆదివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సదుపాయంతో పాటు అవసరమైన సిబ్బంది, యంత్రాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో మొత్తం 1,92,000 కుటుంబాలు ఉన్నాయని, ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారు కూడా ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన వారు బీమా పొందేందుకు అర్హులని వెల్లడించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. బీమా పొందే వ్యక్తులు తమకు నచ్చినంతమందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చని, బీమా పరిహారానికి సంబంధించిన వివరాలను దరఖాస్తులో స్పష్టంగా నమోదు చేసి సంతకం చేయాలని సూచించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA