Gambhiraopet: గంభీరావుపేటలో భారీ చోరీ.. 11 తులాల బంగారం అపహరణ!
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చొరబడి 11 తులాల బంగారం, 82 తులాల వెండి, రూ.లక్ష నగదు అపహరించారు.
Gambhiraopet: గంభీరావుపేటలో భారీ చోరీ.. 11 తులాల బంగారం అపహరణ!
గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని బీరువాను పగులగొట్టి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, 82 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదును అపహరించారు.
గంభీరావుపేట గ్రామానికి చెందిన మారవేణి పరశురాములు (51) ఈ నెల 22న మధ్యాహ్నం భార్య, పెద్ద కుమారుడితో కలిసి వేములవాడలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా కనిపించాయి. బీరువాను పరిశీలించగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
దీంతో బాధితుడు నవంబర్ 23న గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గంభీరావుపేట ఎస్ఐ ఆర్. బాలరాజు ప్రజలకు సూచించారు.




