Karimnagar: మాదకద్రవ్యాల ముప్పుకు చట్టంతో అడ్డుకట్ట: కరీంనగర్ సదస్సు!
Karimnagar: నల్సా 'డాన్' పథకంలో భాగంగా కరీంనగర్ యంజేపి బీసీ గురుకుల పాఠశాలలో శనివారం మాదకద్రవ్యాల నియంత్రణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
Karimnagar: మాదకద్రవ్యాల ముప్పుకు చట్టంతో అడ్డుకట్ట: కరీంనగర్ సదస్సు!
కరీంనగర్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) రూపొందించిన డాన్ (డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ DAWN - ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ ఇండియా) పథకం - 2025లో భాగంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ అనుమతితో, కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ ఆదేశాల మేరకు కరీంనగర్‌లోని యంజేపి బీసీ (బాలుర) గురుకుల (మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం) పాఠశాలలో సంస్థ సభ్యులు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
బాలలను మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించి, ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిపించాలనే లక్ష్యంతో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14 నుంచి 27వ తేదీ వరకు పక్షం రోజుల పాటు ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీసీ గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ. కిరణ్ కుమార్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, పెరుక రంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, చెడు అలవాట్లకు లోనుకాకుండా స్వీయ నియంత్రణ పాటించడం, స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నిపుణుల సహాయం పొందడం వంటి అంశాలను వివరించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన ఎన్‌డీపీఎస్ చట్టం - 1985, బాలల రక్షణకు సంబంధించిన జువెనైల్ జస్టిస్ చట్టం - 2015లోని నిబంధనలను వివరిస్తూ, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సహాయం 112, ఉచిత న్యాయ సేవలకు 15100 లాంటి టోల్ ఫ్రీ నెంబర్ లను సంప్రదించవచ్చని తెలిపారు. బాలల భద్రత, ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజం సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, వాటి వినియోగానికి వ్యతిరేకంగా చైతన్యవంతులుగా వ్యవహరిస్తామని, మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యం. సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




