Karimnagar: న్యాయ విజ్ఞానం సమాజ మార్పునకు సాధనం కావాలి!
Karimnagar: జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కిమ్స్ లా కాలేజీలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ పాల్గొన్నారు.
Karimnagar: న్యాయ విజ్ఞానం సమాజ మార్పునకు సాధనం కావాలి!
Karimnagar: న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కేవలం న్యాయవాద వృత్తికి పరిమితం కాకుండా, సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం అందించే సామాజిక బాధ్యతను కూడా స్వీకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ అన్నారు.
న్యాయ విజ్ఞానాన్ని ప్రజల హక్కుల పరిరక్షణకు, సమాజంలో సమానత్వం, న్యాయ స్థాపనకు వినియోగించాలని పిలుపునిచ్చారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం (నవంబర్ 9) సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కిమ్స్ లా కాలేజ్ విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని ముందస్తుగా నిర్వహించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ అనుమతితో, కార్యదర్శి యశ్వంత్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును, ఆర్టికల్ 39-A సమాన అవకాశాలతో న్యాయం అందించేందుకు ఉచిత న్యాయ సహాయాన్ని నిర్దేశిస్తున్నాయని వివరించారు.
న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టం - 1987 ద్వారా అర్హులైన పౌరులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కోర్టుల్లో న్యాయవాది సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. నల్సా, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థల విధులు, లోక్ అదాలత్‌లు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారంపై వివరించారు.
న్యాయ విద్యార్థులు.. మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల హక్కులపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గృహహింస, వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, పోక్సో నేరాలు, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలు, వినియోగదారుల సమస్యలు వంటి అంశాల్లో బాధితులకు సరైన న్యాయ మార్గదర్శకత్వం అందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
న్యాయవాద వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజల హక్కులను కాపాడే సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధితుల సమస్యలను ఓపికగా వినడం, వారి గోప్యతను కాపాడటం, వివక్షకు తావులేకుండా న్యాయ సహాయం అందించడం, చట్టాలను సామాన్యులకు అర్థమయ్యే భాషలో వివరించడం ప్రతి న్యాయ విద్యార్థి అలవర్చుకోవాలని సూచించారు.
న్యాయ విద్యార్థులు తమ కళాశాలల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ అవగాహన శిబిరాల ద్వారా, పాఠశాలలు, మహిళా సంఘాలు, వృద్ధాశ్రమాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందించాలని సూచించారు. సైబర్ మోసాలు, మహిళల భద్రత, బాలల హక్కులు, వృద్ధుల సంక్షేమం వంటి సమకాలీన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యువ న్యాయ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు.
న్యాయ విజ్ఞానాన్ని సమాజంలోని బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు వినియోగిస్తామని, న్యాయ చైతన్యాన్ని ప్రజల్లో విస్తరింపజేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే రాజ్యాంగ ఆశయ సాధనలో న్యాయ విద్యార్థులు భాగస్వాములు కావాలని, న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేసే సామాజిక న్యాయ దూతలుగా ఎదగాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ కోరారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ పేర్యాల సాకేత్ రామారావు, లా కళాశాల ప్రిన్సిపల్ నవీన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, ఏ.కిరణ్ కుమార్, సిహెచ్. చంద్రప్రకాష్ రెడ్డి, అధ్యాపకులు, కొమురయ్య, వెంకటస్వామి, కిషన్, వంశీ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.




