Manthani: మంథని అభివృద్ధికి ప్రభుత్వ భూముల గుర్తింపు వేగవంతం.. కలెక్టర్!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ అభివృద్ధి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
Manthani: మంథని అభివృద్ధికి ప్రభుత్వ భూముల గుర్తింపు వేగవంతం.. కలెక్టర్!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని ప్రజా అవసరాలకు వినియోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల నిర్మాణంతో పాటు పట్టణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
శనివారం మంథని ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై పట్టణ పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత వినియోగం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏటీసీ, ఎన్ఏసీ పరిధిలోని ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, భూముల విస్తీర్ణం, సరిహద్దులు, ప్రస్తుత వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు భూములను ఎంపిక చేసేటప్పుడు రహదారి సౌకర్యం, ప్రజలకు అందుబాటు, భవిష్యత్తులో విస్తరణకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలను సమన్వయం చేసుకుంటూ అందుబాటులో ఉన్న భూములను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
అనంతరం ఏటీసీ, ఎన్ఏసీ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించి, వాటి పరిస్థితి, విస్తీర్ణం, సరిహద్దులు, భవిష్యత్తులో ఏయే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా భూముల కేటాయింపులో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ ఆరిఫోద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




